తెలంగాణ విద్యా విధానం రూపకల్పనకు కావాల్సిన సిఫార్సులు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించేందుకు నియమించబడిన తెలంగాణ విద్యా కమిషన్ ఉపాధ్యాయ వృత్తిని వేతనంతో వెలకట్టడం అత్యంత దురదృష్టకరమని, ఇది ఉపాధ్యాయ వృత్తికి అవమానకరము అని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర పూర్వ అధ్యక్షులు తీకుల్ల సాయిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ఉపాధ్యాయులకు ఇచ్చేది వేతనం కాదు అది గౌరవభృతి అని ఈ సృష్టిలో వెలకట్టలేని వృత్తి ఏదైనా ఉందంటే అది ఉపాధ్యాయ వృత్తి మాత్రమే అన్నారు.
అణగారిన వర్గాల పిల్లలకు విద్యాగంధం ప్రభుత్వ పాఠశాలల ద్వారానే అందుతుందనీ,ప్రస్తుతం ఈ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ పేద వర్గాలకు అనేక అంశాలలో తీవ్ర నష్టం కలిగించేలా ఉందన్నారు. ఉపాధ్యాయుల వేతనాలు తగ్గించాలనే ప్రతిపాదన అత్యంత విచారకరం అని ఇది ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం కూడా అవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ కంటే ఉపాధ్యాయులకు ఎక్కువ వేతనాలు ఇస్తున్నారనీ గుర్తు చేశారు.అలాగే 12వ తరగతిలో మాత్రమే బోర్డు పరీక్ష నిర్వహించడం సరిది కాదన్నారు. అలా జరిగినట్లయితే ఉపాధ్యాయులు నిర్లిప్తత పెరుగుతుందని, పదో తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు 3 నుంచి 4 నెలలు ప్రత్యేక శిక్షణ ఇచ్చి మళ్లీ పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. 12వ తరగతిలో ఒక్కసారే బోర్డు పరీక్ష అంటే అనేక మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యి కూలీలుగా మారే ప్రమాదం ఉందని తెలిపారు. కనీస ఉత్తీర్త శాతాన్ని 45% పెంచాలని కూడా ఆ శాస్త్రీయమని ప్రస్తుతం ఉన్న 35% సరిపోతుందన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు సరైన వసతులు కల్పించకుండా ఉత్తీర్ణత మార్కులు పెంచడం పేదలకు విద్య అందరి ద్రాక్ష అవుతుందన్నారు. ముఖ్యమంత్రి మంత్రులు శాసనసభ్యులు సంపన్న రాష్ట్రం అంటూ అత్యధిక వేతనం తీసుకుంటున్నారని, కొంతమంది ప్రజాప్రతినిధులు రెండు మూడు పెన్షన్స్ కూడా తీసుకుంటున్నారని గుర్తు చేశారు. ఒక్క ఉపాధ్యాయులకి ఎక్కువ వేతనాలు ఉన్నాయని చెప్పడం సరైనది కాదన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి ఈ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్‌ను పరిగణలోకి తీసుకోకుండా, విద్యారంగంలో నిష్ణాతులైన విద్యావేత్తలతో కొత్త కమిటీ ఏర్పాటు చేసి మళ్లీ అభిప్రాయాలు సేకరించాలని కోరారు.
