కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పిడమర్తి రవి, వక్కలగడ్డ
ఖమ్మం, మార్చి 8: తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద కులమైన మాదిగలను కాంగ్రెస్ పార్టీలో కొంతమంది కుట్ర చేసి అణిచివేస్తున్నారని రావలసిన అవకాశాలను రానీయకుండా పార్టీలో మేనేజ్ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు పిడమర్తి రవి ఆరోపించారు. ఆదివారం ఖమ్మం ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్ద కులాన్ని పక్కకు పెట్టడం వల్ల కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో నష్టం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఆలోచించి మాదిగల కు న్యాయం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగ ఉద్యోగుల సభలో మాదిగల కోసం మాట్లాడిన తీరును మాదిగల పెట్టిన డిమాండ్లు అంగీకరించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలియజేసారు. ఆ సభలో పెట్టిన డిమాండ్లను పరిష్కారం త్వరగా చేయాలని ముఖ్యమంత్రిని కోరుతున్నామన్నారు. రానున్న కాంగ్రెస్ పార్టీ పదవుల్లో, ప్రభుత్వ నియామకాల్లో మాదిగలకు అవకాశాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. వక్కలగడ్డ సోమా చంద్రశేఖర్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో రెండు ఎస్సీ నియోజకవర్గాలలోను మాల ఉప కులాలకు చెందిన వారే ఎమ్మెల్యేలుగా ఉన్నారని మాదిగల కి ఎటువంటి అవకాశం దక్కలేదని అన్నారు.

అదేవిధంగా ఈ మధ్య జరిగిన ఏదులాపురం మున్సిపాలిటీలో కూడా మాలలకే అవకాశం దక్కిందని మాదిగలకు అన్యాయం జరిగిందని ఆరోపించారు ఏదులాపురంలో 30 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడిన మాదిగలు ఉండగా వారికి కూడా అవకాశం ఇవ్వకపోవడం శోచనీయమని తమ సొంత ప్రయోజనాల కోసం పార్టీని ఫణంగా పెట్టవద్దని కాంగ్రెస్ పార్టీ కి మాదిగలను దూరం చేయవద్దని కనీసం ఇప్పటికైనా రాబోయే నామినేటెడ్ పదవులను మరియు పార్టీ పదవులలోనూ జిల్లాలోనూ మరియు రాష్ట్రస్థాయిలోనూ జనాభా దామాషా ప్రకారం మూడింట రెండు వంతులు మాదిగలకు కేటాయించి న్యాయం చేయాలని కోరారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మంత్రులు మాదిగ సామాజిక వర్గానికి పదవులు ఇవ్వవలసిందిగా ముఖ్యమంత్రికి టి పిసిసి అధ్యక్షులకు సిఫార్సు చేయవలసిందిగా వినమ్రంగా వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు బొబ్బిలి భరత్ చంద్ర జిల్లా ఎస్సీ సెల్ నాయకులు తోళ్ల రాకేష్ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కష్టాల క్రాంతి కుమార్, ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ మాదిగ కార్యకర్తలు పాల్గొన్నారు.
