సంక్షేమ నిధి ఊసే లేదు, ఇళ్ల స్థలాల ప్రస్తావనే లేదు,హెల్త్ స్కీమ్ ముచ్చట అసలే లేదు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఈ రోజు ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో జర్నలిస్టులకు మొండి చెయ్యి చూపించారు. జర్నలిస్టులకు గత ప్రభుత్వంలో కంటే తాము అధికంగా సంక్షేమం కోసం నిధులు కేటాస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు జర్నలిస్టులను పూర్తిగా విస్మరించారని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ లు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన 2026-27 బడ్జెట్ లో జర్నలిస్టుల ఊసే లేదు అని,గత ఎన్నికల మ్యానిఫెస్టోలో అదనంగా 100 కోట్లు సంక్షేమ నిధిని కేటాయిస్థాని చెప్పి ప్రస్తుత బడ్జెట్ లో కూడా చిల్లి గవ్వ కేటాయించకపోవడం అన్యాయం అన్నారు. ఇళ్ల స్థలాల ప్రస్తావన చేయకపోవడం, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని జర్నలిస్టుల సంఘాల నాయకులు పలుమార్లు కోరినా హెల్త్ కార్డు సంబంధించిన అంశమే బడ్జెట్ ప్రసంగంలో లేక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. దీనిని బట్టి చూస్తే జర్నలిస్టులకు ఆరోగ్య భద్రతను అందించే జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ను ఈ ప్రభుత్వం శాశ్వతంగా రద్దు చేసిందా అనే అనుమానం కలుగుతుందన్నారు. ఇది తెలంగాణ జర్నలిస్టులకు పూర్తిగా అన్యాయం చేసిన బడ్జెట్ గా తాము భావిస్తున్నట్లు ప్రకటించారు. ఈ బడ్జెట్ పై తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి, ఎ.రమణ కుమార్,టి యు డబ్ల్యూ జె కోశాధికారి యోగానంద్ లు సైతం పెదవి విరిచారు.
