రోజులు మారాయి
మిత్రుడేవాడైనా ఉంటే
వాడే నీ రహస్యాలు కన్న బద్ధశత్రువు
నిన్ను నిలువునా కూల్చేదతనే
నీ గుబులు రహస్యాలు పంచుకోకు ఎవరితో
నీ ఉచ్ఛబుడ్లు చేసిన కొంపకొల్లేర్లు
నీ వెన్నువిరిగిన దుఃఖాలు
నీ జరిపిన ప్రేమలు లేని గాలి కబుర్లు
సరస సల్లాపాల అనాకారి మదమెక్కిన వికృతులు
పంచుకోకు మిత్రుడెవడితో వాడే పక్కలో బల్లెం
ఓరీ చుంచు ముహపోడా
కాలం శరవేగంగా దూసుకెళ్తోంది
ఈ రోజు సౌమ్య మిత్రుడే రేపు బద్ధశత్రువు
ఆదనులో ఓర్వలేక దెబ్బకొట్టి
నిన్ను పాతాళంలోకి కసితీరా తొక్కేసి
జనంలో గుండెలు పగిలేట్లు నగుబాట్లపాలు చేస్తాడు
నీవు కక్కలేక మింగలేక దుఃఖితునివై రోదిస్తావ్
నీవెక్కిన శిఖరాల నుండి తోస్తాడు
పల్లికిలించి నవ్వుతూనే గోతులు తీసి పాతరేసినా నమ్మవు
రహస్యాలు గుండెల్లో తన్నువున్నంతవరకు దాచుకో
కౌగిలిలో దూరే ప్రేయసికి కూడా నీ గత జీవితమంతా వల్లెవేయకు
ఈ ప్రాపంచిక జీవితాలే ఎండమావుల్లో నీళ్లకోసం పరుగులు
నీవొక్కడివే అమాయకంగా నీతిమంతుడివైతే
లోకం నీకు వెర్రెత్తించి బజారున పడేస్తుంది
కాలాల దగ్గట్లు పరుగెత్తు
మోసానికి మోసం దగాలకు దగా చేయి
నీ అతి మంచితనం నిన్నే ఖూనీ చేస్తుంది
నీకు నిన్నే శత్రువుని చేస్తుంది ఈ లోకం మొసలి కన్నీళ్లు కారుస్తూ
తస్మాత్ జాగ్రత్త,,,,,,!!
అపరాజిత్
సూర్యాపేట
![](https://telanganasakshi.com/wp-content/uploads/2025/01/WhatsApp-Image-2025-01-10-at-8.13.18-PM-631x1024.jpeg)