వెలుగు నుండి చీకట్లోకా
చీకటి నుండి వెలుగులోకా
ఎటు వెళ్లినా బోనులో సింహం గజగజ భయమే
చిన్నతనం నుండి కనుపాపలలో
భయం భయంగా బ్రతుకుతున్న వాన్ని
నిద్రరాని నిషిరాత్రులెన్నఁని చెప్పను
మనస్సు నిండా గూడుకట్టుకుని వున్న
అగ్ని సముద్రాలెన్నో!మృతసముద్రాలెన్నో!
హృదయంలో తెరుచుకోని
కన్నీళ్ల నదులెన్నో నేటికీ
శ్రుతి తప్పిన రాగాలెన్నో
గళం గద్గదమై రాగం విషాద మవుతోంది
ఎద సంవేదనల నరకాలు
వెలుగుల జీవితం గాఢ శుషుప్తిలోకి
గుండెల్లో గుబులు రాత్రులెన్నో
అదిగో ఆకాశం విరిగి కూలిపడుతోంది
ఉరుములు మెరుపుల జోరువాన
అవిగో కప్పల బెకబెకలు
ఈ తూఫాను గాలివానకు
ఏనాటిదో పెద్ద మర్రిచెట్టు కూలిపడింది
ఎండిపోయిన గడ్డిపోచలన్నీ చిగుళ్లు తొడిగాయి
ఈ బురదలో చెప్పుల బురద
వెనుక ప్యాంట్ చొక్కా నిండా పడింది
ఋతువు మారుతున్నట్లుగా
కోయిలలు గొంతులు మార్చి పడుతున్నాయి
ఈ చలి రాత్రి దుప్పటిలో ముసురు తన్నా
ఏకాకి జీవితం రారమ్మటున్న ఎండమావి
సంధ్యలు మరిచిన ఉదయాస్తమయాలు
వానలకు చలి తీవ్రత తోడునీడ
అందరున్నా తోడుకు నోచుకోని బ్రతుకు
అవును కట్టే కాలేదాకా ఏకాకినే
నా బ్రతుక్కు నౌకరీ ఒకటి
ఏం వెలగబెడదామనో,,,,,!
బయట నాకు వినపడేట్లు గుసగుసలు
తేనె పూసిన కత్తులు
నేను ఎవరిని ఏమన్నానని,,,,!
పక్షులు జాగిలాలు చెప్పే
ప్రకృతి అందాల వింత ఉదంతాలు
ఈ సంకేతాల కన్నా గొప్పా వీళ్ళు !
వర్షపు జల్లులతో కలిసి వెన్నెల వర్షం కురుస్తోంది
అక్షరాలు కూడా అలాగే కళ్ల నుండి రాలుతున్నాయి
చల్లని ఉషస్సులన్నీ గుండెలు కోస్తున్నాయి
నల్లబల్లపై సుద్దముక్కతో రాసిన ఎన్ని అక్షరాలు ఎన్ని ఏళ్ళు చేరిపానో,,,,,,!
గుండెల్లో నిప్పుల కుంపటి ఎన్ని ఏళ్ళు కుమిలిపోయిందో
మరచినా కొద్ది తరుముకొస్తుంది
కోరికలు గుర్రాలై పరుగులు తీస్తుంటే
నిరుద్యోగ పరీక్షలు ఎన్నెన్ని ఓడిపోయాయో
ఈ వర్షాల చలిరాత్రి నీకే చెబుతున్నా
ఉన్నత చదువులు చదివేందుకు గుడ్లగూబల కలల కళ్లయ్యాయి
ప్రతి బళ్ళో అవమానాల గుండె కోతలు ఆరోగ్యం సరిచేసుకోలేక
రోజు నిప్పులపై నడకల క్లాసులు
ఏరోజు కారోజు గజగజ చలివర్షాల మంటలే
సింహానికి బోనును చూస్తే భయం
నాకు నేను ఓదార్చుకుంటే తుఫాను బాధితునికి చలి తీవ్రత
ఇది వానాకాలం చలి మాపుల ఎండమావుల్లో పరుగులు
చదివిన చదువులు గుడిలో హారతిలో తగలేశాను
ఇక ఏ భయం లేదు వయస్సు అయిపోవచ్చింది,,,,,,!!
అపరాజిత్
సూర్యాపేట