ఈ జన్మ ఎత్తినందుకు
విధి వక్రించి ఎన్ని అఖాతాలలో
కూరుకుపోయి అగ్ని శిఖలలో
జీవితం ఎన్ని వక్రగతుల పాలయ్యిందో
ఆ సూరీడు ఎన్ని మంటల్లో దగ్ధం చేశాడో
ఎన్ని దివారాత్రులు కళ్ళల్లో
నా ప్రతిబింబాన్నే నేను చూసుకుని
జనజీవనంలో కలువని ఎకాకినయ్యానో
వసంతాలన్నీ గతించుతూ
కాలం కడలిలో కొట్టుకుపోయానో
ఉరుములు మెరుపుల జడివానల్లో
ఓదార్పు లేని కన్నీళ్లు రాని దుఃఖాలో
నిషిరాత్రి నీడల్లో దేనికోసమో దేములాడనో
మనస్సు పూసిన అక్షరాలు లిఖించని
మూఢ స్వప్నాలలో ముసుగుతన్నానో
నికృష్ట మానవుల కళ్ళల్లో తెల్లారానో
అగమ్యగోచరంగా చరించి
కంటికి మింటికి ఎన్ని అగ్నిధారలయ్యాయో
నా సైకత శిల్పాలెన్ని కూలిపోయాయో
మనస్సు తన రక్షణ తంత్రాలు కోల్పోయి
నిట్టనిలువునా చీలిపోయానో
అక్షరాల ఎండగాలులు వీచి
లిఖించమని కలం కాగితం
సుడిగాలుల కెరటాల్లో వచ్చిపడి
నీ ఎదుట నా అగ్నిపూల జీవితం
పుంకాను పుంకాలుగా నా విధి తలరాతలు లిఖించమంటోంది నీకోసం,,,,,,!!
అపరాజిత్
సూర్యాపేట
