తిరుపతి : తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటఅప్పలనాయుడికి వార్షిక విశిష్ఠ సేవాపురస్కారం లభించింది. ఏటా విశిష్ఠ సేవలు అందించిన ఐపీఎస్ అధికారులకు డీజీపీ కమెండేషన్ డిస్క్ పేరిట అవార్డును అందజేస్తారు.
2021 సంవత్సరానికిగాను ఈ అవార్డుకు తిరుపతి ఎస్పీ ఎంపికయ్యారు. గురువారం సాయంత్రం మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎస్పీ అప్పలనాయుడుకు గౌతంసవాంగ్ బ్యాడ్జి పెట్టి అవార్డు అందజేశారు. ఈ అవార్డుకు రాష్ట్రవ్యాప్తంగా 11 మంది పోలీసు అధికారులు ఎంపికయ్యారు.
చిన్నపిల్లల అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్న వ్యవహారంపై దృష్టిసారించిన ఎస్పీ వెంకటఅప్పలనాయుడు జిల్లా సైబర్‌వింగ్ ద్వారా ఆరుగురిని గుర్తించారు. ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నవారిని గుర్తించి రాష్ట్రంలో తొలిసారిగా అర్బన్ జిల్లాలో కేసులు నమోదు చేశారు. నలుగురిని అరెస్ట్ చేశారు.
మరో ఇద్దరు తెలంగాణలో ఉంటుండటంతో ఆ రాష్ట్ర పోలీసులకు సమాచారం అందించి వారిపై చర్యలు తీసుకునేలా చేశారు. సైబర్ మోసగాళ్లు దోచుకున్న రూ. 6.72 కోట్లను ఫ్రీజ్ చేయించారు. ఇంకా పలు ప్రజోపకరమైన కార్యక్రమాలను నిర్వహించినందుకు ఈ అవార్డు లభించింది.