ఇప్పటికే రెండు, మూడు విడతలు నామినేటెడ్ పోస్టుల భర్తీ జరిగింది.ఇంకా కొన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి. పదవుల కోసం ఎదురు చూస్తున్న నేతలు పదుల సంఖ్యలో ఉన్నారు. కొందరు ఎమ్మెల్సీ కావాలని ఆశ పడుతుంటే మరికొందరు నామినేటెడ్ రేసులో దూకుడు మీదున్నారు. ఈ నేపథ్యంలో నెలాఖరులోగా మరోసారి పదవుల పందేరం స్టార్ట్ కానుందట. ఇంకా ఎన్ని కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించాల్సి ఉంది? ఏయే నేతలకు బెర్త్ దక్కబోతుంది? ఈసారి పదవులు వాళ్లకే..! మూడో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇంకా 50కి పైగా కార్పొరేషన్ పోస్టులు ఖాళీగా ఉండటంతో..ఎవరెవరి యోగం దక్కబోతుందనేది ఉత్కంఠ రేపుతోంది. మరో 15 రోజుల్లో ఆశావహులకు గుడ్‌న్యూస్ రాబోతుందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మిగిలిన నామినేటెడ్ పోస్టుల భర్తీపై కసరత్తును కొలిక్కి తెచ్చిన బాబు, పవన్..టికెట్లు త్యాగం చేసిన వాళ్లకు..గెలుపు కోసం కష్టపడిన వాళ్లకు…వైసీపీ తీరుపై గళమెత్తిన వాళ్లకు పదవులు ఇవ్వాలని భావిస్తున్నారట. పార్టీ కోసం త్యాగం చేసిన వారి ఎదురుచూపులు..
ఇప్పటికే రెండు విడతల్లో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి సర్కారు..తొలి జాబితాలో 21 మంది, సెకండ్ లిస్ట్‌లో 59 మందికి అవకాశం కల్పించింది. అయితే ఆ రెండుసార్లు కూడా..కొందరికి అవకాశం దక్కలేదు. ప్రధానంగా టీడీపీ నుంచి చాలామంది ఆశావహులు ఉన్నారు. ఎన్నికల సమయంలో సీట్లు వదులుకుని..పార్టీ కోసం త్యాగం చేసిన వారిలో చాలామంది నామినేటెడ్ పోస్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. మూడో విడత నామినేటెడ్ పోస్టుల జాబితాపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. గత రెండు జాబితాల్లో జనసేన, బీజేపీల కంటే..టీడీపీ నేతలకే ఎక్కువగా పదవులు దక్కాయి. అయితే టీడీపీ నుంచి ఇంకా న్యాయం జరగలేదంటూ..మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా సహా..దేవినేని ఉమా, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వంటివారు అసంతృప్తిలో ఉన్నారట. వీరికితోడు నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కూడా..నామినేటెడ్ పోస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక అనంతపురం జిల్లాకు చెందిన యామినీ బాల కుటుంబం కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.వర్మకు క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ పోస్ట్? ఇక గుంటూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ కళ్లుకాయలు కాచేలా పదవి కోసం చూస్తున్నారు. ఈయన గత ఎన్నికల్లో టికెట్‌ను త్యాగం చేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత..నామినేటెడ్ పదవి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పిఠాపురం సీటును త్యాగం చేసిన వర్మకు క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ పోస్ట్ దక్కబోతుందని టాక్. దాదాపుగా ఇంకా 50 కార్పొరేషన్ల పదవులను భర్తీ చేయాల్సి ఉంది. ఇందులో ఎస్సీ కమిషన్, ఉమెన్ కమిషన్, ఎస్టీ కమిషన్లు ఖాళీగా ఉన్నాయి. మినరల్ డెవలప్ మెంట్, బేవరేజెస్, ఆప్కాబ్, ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, బ్యూటిఫికేషన్ అండ్ గ్రీనరీ కార్పొరేషన్, డైరీ, షీప్ అండ్ గోట్ కార్పొరేషన్ పదువులు ఇంకా భర్తీ కాలేదు.అలాగే అధికార భాషా సంఘం, సాహిత్య అకాడమీ, స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్‌ఫ్రా కార్పొరేషన్, నెడ్ క్యాప్, ప్రణాళిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, కనీస వేతనాల కార్పొరేషన్ల పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇవి కాకుండా పలు కుల సంఘాల కార్పొరేషన్ కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి. టీటీడీ బోర్డులో మరికొందరికి అవకాశం కల్పిస్తారని అంటున్నారు. ఈసారి భర్తీ చేసే పోస్టుల్లో తెలుగు యువతలో కీలకంగా పనిచేసిన నాదెండ్ల బ్రహ్మం చౌదరి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. అలాగే గన్ని ఆంజనేయులు, బూరుగుపల్లి శేషారావు, కనపర్తి శ్రీనివాసరావు, సాహెబ్, మాల్యాద్రి, దారపునేని నరేంద్ర, ఏవీ సుబ్బారెడ్డి, ప్రభాకర్ చౌదరి, సుగుణమ్మ, పరుచూరి కృష్ణ, బండారు హనుమంతరావు, గంటాగౌతమ్, పెందుర్తి వెంకటేశ్, నల్లపాటి రాము, చిరుమామిళ్ల మధు, మాజీ ఎమ్మెల్యే రామానాయుడు పదవులు ఆశిస్తున్నారు. గన్ని ఆంజనేయులు పేరు ఆప్కాబ్ ఛైర్మన్ రేసులో వినిపిస్తుంది. జనసేన నుంచి కూడా అమ్మిశెట్టి వాసు, రాయపాటి అరుణ, రామకృష్ణ, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నుంచి పాతూరు నాగభూషణం, అన్నం సతీష్, బాజీ నామినేటెడ్ పోస్టుల రేసులో ఉన్నారు.త్వరలో సహకార బ్యాంకు ఎన్నికలు రాబోతున్నాయి. వీటిలో జిల్లా స్థాయి ఛైర్మన్ పదవులకు ద్వితీయ స్థాయి నేతల పేర్లు పరిశీలిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మరికొందరు నేతలకు అవకాశం కల్పించాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలో మార్కెట్ కమిటీలను భర్తీ చేసే ఆలోచనలో ఉన్న కూటమి సర్కార్..ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు చేసింది.అయితే కార్పొరేషన్ ఛైర్మన్ల విషయంలో ఇప్పటికే సీఎం చంద్రబాబు దగ్గరకు లిస్ట్ చేరిందంటున్నారు. ఈ నెల 19న చంద్రబాబు, లోకేశ్ దావోస్ పర్యటనకు వెళ్తున్నారని..25న తిరిగి వస్తారని చెప్తున్నారు. ఆ తర్వాత మూడో విడత నామినేటెడ్ లిస్ట్ ఏ సమయంలోనైనా రిలీజ్ అవుతుందని చెప్తున్నారు. చూడాలి మరి ఎవరెవరి నేతలకు కార్పొరేషన్ పదవులు దక్కబోతున్నాయనేది.
AP ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అయిపోయింది.
RELATED ARTICLES