కోయిలమ్మలు పసిపాపకు జోల పాడినట్లు
పూల పరిమళాలు వింజామరలు వీచినట్లు
గాలి తెమ్మెరలు ఊయల లూపినట్లు
వాన చినుకులు చిందులు నేర్పినట్లు
ఉరపిచ్చుకలు చెవుల్లో గుసగుసలాడినట్లు
గులాబీ రేకుల అందం పాప ఏడ్పు నాపినట్లు
చందమామ మోము పాప కిలకిలా నవ్వినట్లు
ఇంటి ఆవుల పాలు పాపకు పట్టినట్లు
ఆవులు గేదెలు అడుగేస్తూ తలలూపినట్లు
కోడిపుంజు కొక్కొరోకో అంటూ కూసినట్లు
నీలిమబ్బుల మధ్య పాప మెరుపులా జిగేల్ మన్నట్లు
వాన కురుస్తూ ఉరుముల ఢమరుకములకు పాప కెవ్వుమన్నట్లు
చల్ల చల్లని గాలులు హాయి గొలుపు సన్నాయిలయినట్లు
సూర్యుడి లేలేత కిరణాలతో పాప మేల్కొన్నట్లు
కలువలు చేతబూని నాన్న ఏతెంచినట్లు
పాప ఆటపాటలు అందరిని ఆనందంలో మునకలేయించినట్లు
అమ్మను చూడగానే ఏడుపు ఆపి ఆబగా ఎదపై ఒదిగినట్లు
చిరుచిరునవ్వుల పాప నాన్న ఒడిలో ఆడుకొన్నట్లు
అమ్మమ్మ నానమ్మలు మిఠాయిలు తినిపించినట్లు
టామీ కుక్కకూనతో ఆడుతూ కేరింతలు కొట్టినట్లు
తోక లేపుకుని లేగదూడ పాప దరిచేరినట్లు
అమ్మ లాలనలో పాప ఉల్లాసంగా తెలియాడినట్లు
దివినుండి తారలు దిగివచ్చి నృత్యం చేసినట్లు
వెన్నెలలో చందమామ గిలిగింతలు పెట్టినట్లు
చల్లని పొదరింట్లో విరబూసిన మందారం పసిపాప!!
ఆపరాజిత్
సూర్యాపేట
